SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 9:09 pm Posted by : SALAM PRODDATUR

జీవనజ్యోతి విద్యాసంస్థల్లో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు

– అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక జీవనజ్యోతి విద్యాసంస్థల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ వై. అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారు. దేవీ నవరాత్రుల విశిష్టతను చాటుతూ నవదుర్గల రూపాల్లో విద్యార్థినులు కొలువుదీరగా, ప్రత్యేకంగా ప్రదర్శించిన ‘మహిషాసుర మర్దిని’ ఘట్టం ఆహూతులను ఎంతగానో అలరించింది. ఇందులో దుర్గామాత పాత్రలో రామయ్య గారి షణ్ముఖ శ్రీజ, మహిషాసురుడి పాత్రలో రామయ్య గారి వెంకట సుబ్బయ్య అద్భుతంగా నటించి తమ ప్రతిభను కనబరిచారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా సాగిన ఈ దృశ్యరూపకం చూపరులను మంత్రముగ్ధులను చేసింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వై. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మన  ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడానికే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయడంలో సాంస్కృతిక సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.అనంతరం వేషధారణలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఉపాధ్యాయులు, యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.