SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:14 pm Posted by : SALAM PRODDATUR

శుక్రవారం ప్రొద్దుటూరు నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం

 

–రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్న ఎమ్మెల్యే  వరదరాజుల రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రొద్దుటూరు నూతన బస్టాండ్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రేపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నూతన బస్టాండ్‌ను ప్రారంభించనున్నారు.ఈ మేరకు గురువారం తన టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మహిళలకు శ్రీశక్తి పథకంతో ఉచిత ప్రయాణం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణాలు 100 కోట్ల మైలురాయిని అధిగమించడం శుభపరిణామమని పేర్కొన్నారు.ఒకే మహిళ పలుమార్లు ప్రయాణించినప్పటికీ, మొత్తం మీద 100 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదవడం ఈ పథకం ద్వారా మహిళలకు లభిస్తున్న ప్రయోజనానికి నిదర్శనమని ఎమ్మెల్యే వివరించారు.

ఆధునిక వసతులతో నూతన బస్టాండ్

నూతనంగా నిర్మించిన బస్టాండ్ అందుబాటులోకి రావడంతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు, ప్రయాణికులకు మరిన్ని ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్ ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుందని చెప్పారు.

పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు

నూతన బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే   పిలుపునిచ్చారు.