SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 2:19 am Posted by : SALAM PRODDATUR

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. ‘అమరజీవి జలధార’ లక్ష్యం

 

 

–90 లక్షల ఇళ్లు.. 48 వేల గ్రామీణ ప్రాంతాలు.. 3.30 కోట్ల మందికి తాగునీరు

–వచ్చే ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి ₹1.30 లక్షల కోట్లు

–సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

–సీఎం చంద్రబాబు

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రూ.30 వేల కోట్లతో జల్‌ జీవన్‌ మిషన్‌–అమరజీవి జలధార కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 90 లక్షల ఇళ్లకు, 48 వేల గ్రామీణ ప్రాంతాలకు, సుమారు 3.30 కోట్ల మందికి తాగునీరు అందించేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.తాగునీరు అందించడం కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా ఎంతో కీలకమని సీఎం పేర్కొన్నారు. ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అభినందిస్తున్నానన్నారు.

గత పాలనపై విమర్శలు

జల్‌ జీవన్‌ మిషన్‌ అమలులో గత పాలన తగిన స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ వంటి రాష్ట్రాలు కేంద్రం నుంచి భారీగా నిధులు పొందగా, ఆంధ్రప్రదేశ్‌ గత పాలనలో కేవలం రూ.2,600 కోట్ల మేర మాత్రమే పొందిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని విమర్శించారు.గత పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వంటి మౌలిక వసతులు దెబ్బతిన్నాయని సీఎం అన్నారు. రహదారుల విషయంలో ‘నాడు–నేడు’ పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు.

గ్రామీణాభివృద్ధికి రూ.1.30 లక్షల కోట్లు

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి రూ.4,136 కోట్లకు పైగా నిధులు వచ్చాయని పేర్కొన్నారు.గ్రామాలకు రహదారులు, పంటకుంటలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

పెన్షన్లతో పేదలకు అండ

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కార్యక్రమం ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు రూ.76 వేల కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేశామని చెప్పారు. ప్రకృతి విపత్తులు, ఎల్‌నినో వంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రెండేళ్లలో సాగునీటి కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలో రిజర్వాయర్లను నింపుతున్నామని, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు.గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో జల వనరుల వినియోగానికి కొత్త దిశ చూపించామని అన్నారు.

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు

 

మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రాజెక్టుల పనులకు సంబంధించి తేదీలతో కూడిన క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు తెలిపారు.గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి

గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో కరవు సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని చంద్రబాబు అన్నారు. కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ భారీగా గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. వరద సమయంలో కనీసం 200 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోగలిగితే రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని అన్నారు.

అభివృద్ధి–సంక్షేమం–సుపరిపాలనే లక్ష్యం

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు, గ్రామీణ ప్రాంతాలకు మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.