SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 1:57 am Posted by : SALAM PRODDATUR

పార్టీ .. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం

 

–తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

–ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

–₹30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం

–3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం

–పులివెందులలో 299 గ్రామాలకు ₹280 కోట్లతో తాగునీటి పరిష్కారం

 

సలాం ప్రొద్దుటూరు:

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదని, అభివృద్ధిలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ ప్రధాన లక్ష్యమని తెలిపారు.సోమవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు

రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో 50,315 పనులు చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే ఉన్న 24,601 ఆవాసాల్లో 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచి స్థిరీకరించడంతో పాటు మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు కల్పించనున్నట్లు చెప్పారు.మొత్తంగా రాష్ట్రంలోని 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా భారీ కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు.

గతంలో నిర్లక్ష్యం.. ఇప్పుడు వేగంగా పనులు

జల్ జీవన్ మిషన్‌కు గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. 2019–24 మధ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.26 వేల కోట్లు అందించినప్పటికీ, గత ఐదేళ్లలో సుమారు రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి అక్కడక్కడ పైపులైన్లు, చిన్నచిన్న పనులతో సరిపెట్టారని ఆరోపించారు.2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి జల్ జీవన్ మిషన్‌ను కొనసాగించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని పనులను వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే రూ.4,500 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని తెలిపారు.

ఐదేళ్లలో భారీ నీటి మౌలిక వసతులు

1953 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 816 ఎం.ఎల్.డి సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాలు, 1,072 ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు, 28,086 ఓవర్‌హెడ్ నిల్వ జలాశయాలు, 1.18 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్లు నిర్మించినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు.అయితే ‘అమరజీవి జలధార’లో భాగంగా కేవలం ఐదేళ్లలోనే అదనంగా:

– 1,426 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాలు

– 494 ఓవర్‌హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్లు

– 13,075 ఓవర్‌హెడ్ నిల్వ జలాశయాలు

– 77 వేల కిలోమీటర్ల పైప్‌లైన్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

₹ 9 వేల కోట్లతో 50,283 సింగిల్ విలేజ్ స్కీమ్స్, రెట్రోఫిట్టింగ్ పనులు, రూ.19,500 కోట్లతో 32 మల్టీ విలేజ్ స్కీమ్స్ చేపడుతున్నామని చెప్పారు. నీటి నాణ్యత పర్యవేక్షణకు రూ.1,624 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రాయలసీమ నుంచి ఉద్దానం వరకు

 

ఉద్దానం నుంచి డోన్ వరకు, కర్నూలు నుంచి కుప్పం వరకు, గండికోట, పీఏబీఆర్, ఏలేరు, తాండవ, హిరమండలం, ధవళేశ్వరం తదితర జలాశయాల ఆధారంగా తాగునీటి పథకాలను చేపడుతున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు.కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్న ఉద్దానం, ఏ.కొండూరు ప్రాంతాలతో పాటు కరువు ప్రభావిత రాయలసీమ, పులివెందుల, పుంగనూరు, పలమనేరు, కాలుష్య ప్రభావిత గోదావరి ప్రాంతాలు, ఫ్లోరైడ్ ప్రభావిత మార్కాపురం ప్రాంతాలకు సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా నీటి భద్రత కోసం రూ.6 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆక్వా సాగు, పారిశ్రామిక కాలుష్యం కారణంగా నీటి వనరులు కలుషితమవుతున్న ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి నిరంతరం పరీక్షిస్తున్నామని తెలిపారు.ఇప్పటికే రూ.35 కోట్లతో 340 ఫిల్టర్ బెడ్స్ పునరుద్ధరించామని, మరో 552 ఫిల్టర్ బెడ్స్‌ను రూ.88 కోట్లతో పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ల నిర్వహణతో పాటు నీటి నాణ్యత పర్యవేక్షణకు రూ.1,600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

తాళ్లమాపురానికి రూ.3.5 కోట్ల పనులు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తాళ్లమాపురం, సాగిలిగొడ్డుపల్లి, ములవారిపల్లి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.దాదాపు రూ.1.5 కోట్లతో రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడంతో పాటు రూ.2 కోట్లతో 90 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్‌హెడ్ రిజర్వాయర్, నాలుగు కిలోమీటర్ల పైప్‌లైన్, ప్రత్యేక బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మొత్తం రూ.3.5 కోట్ల విలువైన పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పులివెందులకు ₹280 కోట్లు

ప్రజల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ప్రాంతీయ భేదాలు చూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీనికి నిదర్శనంగా పులివెందులలో అసంపూర్తిగా ఉన్న తాగునీటి పథకానికి రూ.280 కోట్లు కేటాయించి, ఏడు మండలాల్లోని 299 గ్రామాల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే చర్యలు చేపట్టామని తెలిపారు.అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సుమారు రూ.2,500 కోట్లతో ‘పల్లె పండుగ’, ‘అడవితల్లి బాట’ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ తదితర పనులు చేపట్టిన చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్.ఐ.ఎఫ్.ఓ. విధానంలో బిల్లులను సకాలంలో చెల్లిస్తూ కాంట్రాక్టర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.15వ ఆర్థిక సంఘం నిధులను కూడా పంచాయతీలకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.4,200 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చేసి గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రొద్దుటూరు ప్రత్యేకతను ప్రస్తావించిన పవన్

ప్రొద్దుటూరు చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేలగా, మహాత్మా గాంధీ నడయాడిన ప్రాంతంగా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు జన్మనిచ్చిన నేలగా పేర్కొన్నారు.బంగారం, వస్త్ర వ్యాపారంలో ‘మినీ ముంబై’గా, దసరా ఉత్సవాల్లో ‘రెండో మైసూరు’గా ప్రొద్దుటూరుకు ప్రత్యేక ఖ్యాతి ఉందని కొనియాడారు.

ప్రజలకు అభివాదం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం

కార్యక్రమానికి ముందు ప్రత్యేక ర్యాంప్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిసి నడుచుకుంటూ సభకు తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, జౌళి శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ గాయత్రి దేవితో పాటు కూటమి పార్టీల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.