–బాలికలకు అవగాహన కల్పించిన వైద్యాధికారులు.. 16 మందికి హెచ్‌పీవీ టీకా
సలాం ప్రొద్దుటూరు:
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల సంభవించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను హెచ్‌పీవీ వ్యాక్సిన్ ద్వారా గణనీయంగా నివారించవచ్చని ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీత తెలిపారు.స్థానిక ఎస్‌వీవీ హైస్కూల్, అమృత గార్డెన్స్‌లో బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీత మాట్లాడుతూ హెచ్‌పీవీ సాధారణంగా కనిపించే వైరస్ అని, ఇది చర్మం, జననాంగ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని వివరించారు. కొన్ని రకాల హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలం కొనసాగితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు ఇతర క్యాన్సర్లకు కూడా కారణమయ్యే అవకాశం ఉందన్నారు.హెచ్‌పీవీ వైరస్ సోకకముందే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఉత్తమ రక్షణ లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బాలికలు, యువతులు వైద్యుల సూచన మేరకు తగిన వయస్సులో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరమన్నారు.హెచ్‌పీవీ వ్యాక్సిన్ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడంతో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. హెచ్‌పీవీతో సంబంధం ఉన్న మరికొన్ని క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పించే అవకాశం ఉందన్నారు.వ్యాక్సిన్ సురక్షితమైనదిగా, సమర్థవంతమైనదిగా వైద్య రంగంలో గుర్తింపు పొందిందని పేర్కొంటూ, ప్రజలు అపోహలకు గురికాకుండా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ద్వారా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. తమ పిల్లలకు వైద్యుల సలహా మేరకు టీకా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 16 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు తెలిపారు.కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మధుకుమార్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరనాథ్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
