–10 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి.. కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఘన సన్మానం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపల్ గాంధీ పార్కులో సీనియర్ సిటిజన్స్, వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి పార్కును మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్కు వినతి అందజేశారు. సీనియర్ సిటిజన్స్, వాకర్ సభ్యులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పార్కులోని పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.పార్కులో కుక్కల బెడద నివారణకు కంచె ఏర్పాటు చేయడం, పార్కు ఎదురుగా అస్తవ్యస్తంగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడం, వాష్‌రూమ్‌లను ప్రతిరోజూ పరిశుభ్రంగా నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.అదేవిధంగా వాకింగ్ ట్రాక్‌లో ఏర్పడిన గుంతలను పూడ్చి వర్షపు నీరు నిలవకుండా చూడాలని, ట్రాక్ మధ్యలో ఉన్న బోర్ పైపులను పక్కకు మార్చాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆట స్థలంలోని దెబ్బతిన్న పరికరాలను మరమ్మతు చేయడంతో పాటు, విరిగిపోయిన సిమెంట్ బెంచీలను కూడా పునరుద్ధరించాలని కోరారు.పార్కుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం చల్లని మంచినీటి సదుపాయం కల్పించడం, వినియోగంలో లేని ఆడిటోరియంను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సెలవు రోజుల్లో పార్కు నిర్వహణ వేళలను ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున పెంచాలని, చిన్నపిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో వెంటనే సమాచారం అందించేందుకు మైక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలను విన్న కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పార్కు నిర్వహణ, ప్రజల సౌకర్యాల మెరుగుదలకు సంబంధించి తమ సమస్యలను అధికారులు పరిశీలించి పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్, వాకర్స్ ఆకాంక్షించారు.కార్యక్రమంలో మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, MPJ రాయలసీమ ఇన్‌చార్జ్ డా. అయూబ్ ఖాన్, సద్భావన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు పుల్లారెడ్డి, అధ్యక్షులు అల్లాబకాష్, సభ్యులు సుబ్బారావు, సత్తార్, మునిరెడ్డి, రమణాచారి తదితరులు, సీనియర్ సిటిజన్స్, వాకర్ సభ్యులు పాల్గొన్నారు.
