–10 ప్రధాన డిమాండ్లతో డిప్యూటీ తహసీల్దార్‌కు MPJ వినతిపత్రం
సలాం ప్రొద్దుటూరు:
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించడంతో పాటు అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రొద్దుటూరులో కొనసాగింది.“ప్రజాధనం – ప్రజల హక్కు” అనే నినాదంతో సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా బుధవారం MPJ ప్రతినిధులు ప్రొద్దుటూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి డిప్యూటీ తహసీల్దార్ ఏ. కాంత్కు 10 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా MPJ ప్రతినిధులు మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను పారదర్శకంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారితనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వ నిధులు, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకతను నిర్ధారించాలని కోరారు. ప్రజలకు సంబంధించిన పాలనా నిర్ణయాలు, ప్రభుత్వ నిధుల వినియోగంపై అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు, తమ హక్కులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వినియోగించుకుని ప్రభుత్వ వ్యవస్థను ప్రశ్నించాలని MPJ నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో MPJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, రాయలసీమ ఇన్‌చార్జి అయూబ్ ఖాన్, కడప జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, కార్యదర్శి మహ్మద్ రఫీతో పాటు నాయకులు లాల్ బాషా, ముక్తార్, ఫర్హాన్, అబ్దుల్ గని, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు.