SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:01 pm Posted by : SALAM PRODDATUR

గుండె ఆరోగ్యంపై అవగాహనకు 3K వాక్‌థాన్

 

–ప్రొద్దుటూరులో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఉత్సాహంగా నిర్వహణ..

–పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 3K వాక్‌థాన్ నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నిత్య జీవితంలో వ్యాయామం, నడక వంటి శారీరక చురుకుదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. రామసుబ్బయ్య యాదవ్, కార్డియో స్పెషలిస్ట్ డా. ఇజ్రాయిల్, ఎమర్జెన్సీ వైద్యుడు డా. కార్తీక్, అనస్థీషియా వైద్యుడు డా. సాయి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర ఓబులరెడ్డి, శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ జీఎం పరమేశ్వర్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, వైద్య సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వాక్‌థాన్‌లో పాల్గొన్నారు.ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ 3K వాక్‌థాన్‌ ఆరోగ్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.