SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 2:46 pm Posted by : SALAM PRODDATUR

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి

 

–అమరావతికి వెళ్లే ఉద్యోగులను అడ్డుకోవడం సరికాదు.. అదనపు పనిభారం తగ్గించాలి

– వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే    రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గతంలో ఉద్యోగులతో చర్చలు జరిగినప్పటికీ వారి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని రాచమల్లు పేర్కొన్నారు. ఉద్యోగులతో మరోసారి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే సమస్యలపై చర్చించేందుకు అమరావతికి వెళ్లే ఉద్యోగులకు అనుమతులు, సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.ఇప్పటికే ఉద్యోగులపై అదనపు విధుల భారం పెరుగుతోందని ఆయన అన్నారు. ఇంటింటి సర్వే, ఆధార్‌ కేంద్రాల పనులు తదితర అదనపు బాధ్యతలను అప్పగిస్తున్న ప్రభుత్వం, అదే స్థాయిలో ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టాలని కోరారు.ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, పే స్కేలు, అలవెన్సులు, మెటర్నిటీ లీవ్‌ తదితర అంశాల్లో న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఉద్యోగులకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని సూచించారు.ఉద్యోగులపై నమోదైన కేసులను పునఃపరిశీలించాలని, ఉద్యోగుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని రాచమల్లు డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగులు ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు.ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం చేపట్టే కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ మద్దతుగా ఉంటుందని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.