–గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సలాం ప్రొద్దుటూరు –జమ్మలమడుగు:
జమ్మలమడుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గూడెంచెరువు సెక్టార్ పి. బొమ్మేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీఓ జయమ్మ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్త కె.ఎన్. కుమారి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని తల్లులకు వివరించారు.ప్రభుత్వం ద్వారా అందుతున్న పోషకాహార పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కందిపప్పు, నూనె, బియ్యం తదితర పోషకాహార పదార్థాల వినియోగం, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను తల్లులకు వివరించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు వి. భాగ్యలక్ష్మి, యు. లక్ష్మి, ఆశా కార్యకర్త ఆది నారాయణమ్మ, ఆయా శాలిని, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
