
–కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్‌తో పాటు AIపై పట్టు సాధించాలి
–వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్
సలాం ప్రొద్దుటూరు:
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందాలంటే విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ సూచించారు. కమ్యూనికేషన్, అనలిటికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.స్థానిక శ్రీకృష్ణగీతాశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘యువత–ఉద్యోగ అవకాశాలు’ కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ఉద్యోగ విపణికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై అవగాహన పెంచుకోవడంతో పాటు డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఎంఎస్ ఆఫీస్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు.అలాగే విద్యార్థులు UPSC సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలపై దృష్టి సారించి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కఠోరంగా సాధన చేస్తే ఉన్నతస్థాయి ఉద్యోగాలను సాధించవచ్చని తెలిపారు.శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు దేశపాండే శిక్షణ ద్వారా TCS వంటి ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని వీసీ పేర్కొన్నారు. అనంతరం కళాశాలలోని వివిధ విభాగాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ వర్క్‌లను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏ. హరినారాయణ, డైరెక్టర్ ఏ. పృథ్వీ నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ శారదా భవాని, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఎం. రామమోహన్, కోఆర్డినేటర్ గౌరీ శంకర్, హెచ్‌ఓడీలు అజ్రా, మౌనయ్య, గంగాభవాని, రెడ్డమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.
