SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 6:25 pm Posted by : SALAM PRODDATUR

దస్తగిరిపేటలో ఆధ్యాత్మిక వైభవం.. ఘనంగా గ్యార్వి మహోత్సవం

–1,500 మందికి అన్నదానం.. కులమతాలకు అతీతంగా తరలివచ్చిన వేలాది భక్తులు

 

 సలాం ప్రొద్దుటూరు:

 

పట్టణంలోని దస్తగిరిపేట వీధిలో వెలసిన హజరత్ మహబూబ్ సుబహాని (రహ్మతుల్లాహి అలైహి) దస్తగిరి స్వామి జెండాచెట్టు దర్గా వద్ద గ్యార్వి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.  జెండా మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా పరిసర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.మహోత్సవంలో భాగంగా అలీబాష ఖాద్రి అల్ చిష్టి స్వామి ఆధ్వర్యంలో సుమారు 1,500 మందికి అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దర్గా పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమానికి ఆస్థానే మహబూబ్ సుబహాని కొత్త ఖాదరాబాద్ పీఠాధిపతి హజరత్ పీర్ సయ్యద్ అబ్దుల్ రజాక్ బాద్షా ఖాద్రి అల్ చిష్టి ఇఫ్తెకారి జొహరేపీర్ స్వామి హాజరై ప్రత్యేక చదివింపులు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రార్థనలు చేశారు.కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, దూదేకుల వర్గాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దస్తగిరి స్వామి జెండాచెట్టు వద్ద ప్రార్థనలు చేశారు. మతసామరస్యానికి ప్రతీకగా మహోత్సవం ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగింది.ఈ కార్యక్రమంలో అల్లాబకష్ ఖాద్రి రెహమతే పీర్, M.S. ఇలియాస్ ఖాద్రి, ప్రముఖ దస్తావేజు లేఖరి ఎస్. అక్బర్ వల్లీ, M.S. లతీఫ్, మునిసిపల్ ఆర్.ఐ. ఎస్. షఫీవుల్లా, మదీనా డి.జె. గౌస్ బాషా, కూరగాయల వ్యాపారి ఆజం, మహమ్మద్ బర్హాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వామివారి యువజన భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.11వి మహోత్సవం సందర్భంగా దస్తగిరిపేటలో ఎటుచూసినా భక్తుల సందడే కనిపించింది. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.