SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 4:52 pm Posted by : SALAM PRODDATUR

“యా గౌస్ అల్ మదద్” నినాదాలతో మారుమ్రోగిన వగరూరు..

–హజ్రత్ హసన్ పీర్ ఖాద్రీ (రహ్) దర్గాలో వైభవంగా గ్యార్వి షరీఫ్

–భక్తిశ్రద్ధలతో పెద్ద జెండాల ఊరేగింపు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సలాం ప్రొద్దుటూరు – వగరూరు:

మంత్రాలయం మండల పరిధిలోని వగరూరు గ్రామంలో హజ్రత్ పీర్-ఏ-తరీకత్, షహ్‌జాదా-ఏ-గౌస్-ఏ-ఆజమ్ సయ్యద్ షా హసన్ పీర్ ఖాద్రీ (రహ్మతుల్లాహి అలైహి) దర్గాలో  గ్యార్వి షరీఫ్ వేడుకలు శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.గ్యార్వి షరీఫ్ సందర్భంగా దర్గా పరిసరాలు “యా గౌస్ అల్ మదద్” నినాదాలతో మారుమ్రోగాయి. భక్తులు, మురీదులు, ఆధ్యాత్మిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫాతేహా, జిక్ర్, దువా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

వైభవంగా పెద్ద జెండాల ఊరేగింపు

షరీఫ్ సందర్భంగా నిర్వహించిన పెద్ద జెండాల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దర్గా ఆవరణతో పాటు వగరూరు గ్రామంలోని ప్రధాన ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఊరేగింపు సందర్భంగా భక్తుల జిక్ర్, దువాలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు

ఈ సందర్భంగా పీఠాధిపతులు సయ్యద్ షా సాహెబ్ పాషా ఖాద్రీ, సయ్యద్ షా సబీర్ పాషా ఖాద్రీ, సయ్యద్ షా ఆసిఫ్ పాషా ఖాద్రీ, సయ్యద్ షా సాహెబ్ పీరాన్ ఖాద్రీ, సయ్యద్ షా పాషా ఖాద్రీ, సయ్యద్ షాకిర్ ఖాద్రీ, సయ్యద్ షా లతీఫ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.వారి ఆధ్వర్యంలో ఫాతేహా, జిక్ర్, దువా తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తగిరి స్వామి ఆధ్యాత్మిక పరంపర, హజ్రత్ హసన్ పీర్ ఖాద్రీ (రహ్), దస్తగిరి స్వామి వారి జీవిత విశేషాలు, సేవలు మరియు ఆధ్యాత్మిక సందేశాలను భక్తులకు వివరించారు.

వేలాదిమందికి అన్నదానం

గ్యార్వి షరీఫ్ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. వగరూరు గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మురీదులు కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు.కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ వేడుక సోదరభావం, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

ఆధ్యాత్మిక సందడితో కళకళలాడిన దర్గా

గ్యార్వి షరీఫ్ సందర్భంగా వగరూరు గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. దర్గా వద్ద భక్తుల రాకతో సందడి నెలకొంది. భక్తులు హజ్రత్ హసన్ పీర్ ఖాద్రీ (రహ్) వారి వసీలాతో అల్లాహ్ తఆలా రహ్మత్, బరకత్ కోసం ప్రత్యేక దువాలు చేశారు.అల్లాహ్ తఆలా ఈ పవిత్ర షరీఫ్‌ను కబూల్ చేసి, సమస్త  ఉమ్మత్‌పై తన రహ్మత్, బరకత్, ఫజల్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.