SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 12:55 am Posted by : SALAM PRODDATUR

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట

–పలు దుకాణాల్లో తనిఖీలు.. వ్యాపారులకు అవగాహన.. ప్లాస్టిక్ సేకరణ

–ప్రతి మూడో శనివారం క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ సభ్యులు సిద్ధం: కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

 

సలాం   ప్రొద్దుటూరు:

పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ సంకల్ప దీక్ష అడ్వైజరీ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. పట్టణంలోని పలు దుకాణాలను సందర్శించి ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించడంతో పాటు వ్యాపారులకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద లభించిన ప్లాస్టిక్‌ను సేకరించి, ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత పదార్థాలను వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ , ఏపీ ఎన్జీవోస్ చైర్మన్ రామ సుబ్బయ్య యాదవ్.

మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి, సామాజిక సేవకులు, ట్రాఫిక్ సీఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారులతో మాట్లాడిన కమిటీ సభ్యులు ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ప్రతి మూడో శనివారం క్షేత్ర పర్యటన

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యాన్ని సాధించేందుకు అడ్వైజరీ కమిటీ సభ్యులు ఇకపై ప్రతి మూడో శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో వ్యాపారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, సామాజిక సేవకులు సమిష్టిగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.“ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం ప్రజల సహకారంతో ముందుకు సాగుతాం” అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.