SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:42 pm Posted by : SALAM PRODDATUR

లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాలి

 

–ఆడపిల్లలపై వివక్షకు తావులేకుండా సమాజం బాధ్యతగా వ్యవహరించాలి

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరులోనీ జిల్లా ఆసుపత్రి సబ్‌ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ అడ్వైజరీ కమిటీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. గీత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా డా. గీత మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్షను నివారించడంతో పాటు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టేందుకు పీసీ & పీఎన్‌డీటీ (PC & PNDT) చట్టం కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. గర్భధారణకు ముందు లేదా గర్భధారణ అనంతరం లింగ ఎంపికను చట్టం నిషేధిస్తుందని వివరించారు.లింగ ఎంపికను నిరోధించడం, గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించేందుకు ప్రీ-నేటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ను దుర్వినియోగం చేయకుండా నియంత్రించడం, ఆడ శిశువులపై వివక్షను అరికట్టడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించడం లేదా తెలియజేయడం చట్టవిరుద్ధమని, అల్ట్రాసౌండ్‌ సహా ప్రీ-నేటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ను చట్టంలో నిర్దేశించిన వైద్య ప్రయోజనాల కోసం మాత్రమే, నమోదైన కేంద్రాల్లో అర్హత కలిగిన వైద్య సిబ్బంది ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. నమోదైన కేంద్రాలు నిర్దేశించిన రికార్డులు, రిజిస్టర్లు, ఫారాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించే కేంద్రాలు, సంస్థలు లేదా వ్యక్తులపై చట్టపరమైన చర్యలు, శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

 

ఆడపిల్ల కుటుంబానికి, సమాజానికి విలువైన సంపద

 

జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. ఆనంద్‌ బాబు మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి పరీక్షలు చేయించుకోవద్దని సూచించారు. “ఆడపిల్ల భారంగా కాదు.. కుటుంబానికి, సమాజానికి, దేశానికి విలువైన సంపద” అని పేర్కొన్నారు.లింగ వివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆడపిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యం, సమాన హక్కుల కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆడపిల్లను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్‌ డా. యశస్విని, వైద్యాధికారులు డా. నాగార్జున, డా. సుప్రియ, డా. మురళి, డా. మధు, డా. మానస, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు దేవదాసు, శ్రీదేవితో పాటు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.