
–భక్తిశ్రద్ధలతో ఘనంగా ఏర్పాట్లు..
–కులమతాలకు అతీతంగా పాల్గొనాలని పీఠాధిపతి పిలుపు
సలాం ప్రొద్దుటూరు – కోగటం:
ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన కోగటం హజరత్ సయ్యద్ షా షా ఆలం పీర్ ఖాద్రి (రహ్మతుల్లాహి అలైహి) దర్గాలో అక్టోబర్ 1న దస్తగిరి స్వామి జెండా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ షా తాహిర్ పాషా ఖాద్రి తెలిపారు.దస్తగిరి స్వామి నెల సందర్భంగా ప్రతి సంవత్సరం దర్గా ఆవరణలో హజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని గౌస్-ఎ-ఆజమ్ దస్తగిరి (రహ్మతుల్లాహి అలైహి) జ్ఞాపకార్థం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఫకీర్ల మేళాలతో జెండాల ఊరేగింపు
అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు దస్తగిరి స్వామి పెద్ద జెండాలను ఫకీర్ల మేళాల నడుమ కోగటం పట్టణంలోని వీధుల గుండా ఘనంగా ఊరేగించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు దర్గా ఆవరణలో జెండాలను ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు.జెండా ప్రతిష్ఠ అనంతరం ఫాతేహా, ప్రత్యేక దుఆలు, ప్రార్థనలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి తెలిపారు. చదివింపులు పూర్తయిన అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అందరికీ ఆధ్యాత్మిక ఆహ్వానం
ఈ మహోత్సవం సూఫీ సంప్రదాయంలోని ప్రేమ, సోదరభావం, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులమత భేదాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫాతేహాలో భాగస్వాములై, దస్తగిరి స్వామి దువా, ఫైజ్‌కు పాత్రులు కావాలని సయ్యద్ షా తాహిర్ పాషా ఖాద్రి ఆకాంక్షించారు.దస్తగిరి స్వామి జెండా మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా వద్ద భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.