SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 11:21 pm Posted by : SALAM PRODDATUR

వర్షాలపై అప్రమత్తం.. నగరంలో కమిషనర్ విస్తృత తనిఖీలు

 

–సులభ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలు పరిశీలన.. నిల్వ నీటిపై ప్రత్యేక దృష్టి

 

–దోమల నివారణకు ఫాగ్గింగ్.. ప్రజల ఫీడ్‌బ్యాక్ నమోదు

 

సలాం ప్రొద్దుటూరు:

నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు. అధికారుల బృందంతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, దోమల నివారణ చర్యలను పరిశీలించారు.పలు సులభ్ కాంప్లెక్స్‌లను తనిఖీ చేసిన కమిషనర్, అక్కడి సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై యాత్రికులు, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ నమోదు చేసుకున్నారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లో నిల్వ నీటి తొలగింపు

వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని పరిశీలించిన కమిషనర్.. సంబంధిత ప్రాంతాల్లో డ్రైన్లను క్లియర్ చేసి నీటిని వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.నగరంలోని పలు దుకాణాలను తనిఖీ చేసిన ఆయన ప్లాస్టిక్ వినియోగం, పారిశుధ్య నిర్వహణపై వ్యాపారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటిస్తూ నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.

వేలాది టైర్లలో నిల్వ నీరు.. వెంటనే తొలగింపు

బస్సు స్టాండ్ ప్రాంతంలో వేలాది టైర్లలో వర్షపు నీరు నిల్వ ఉండటాన్ని కమిషనర్ గుర్తించారు. దోమల వృద్ధికి ఇది కారణమయ్యే అవకాశం ఉండటంతో తక్షణమే నిల్వ నీటిని తొలగించి మాలతీయన్ స్ప్రేయింగ్ చేపట్టాలని శానిటేషన్ సూపర్‌వైజర్ నూర్ బాషాకు ఆదేశాలు జారీ చేశారు.దోమల నివారణలో భాగంగా రానున్న రెండు రోజులపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫాగ్గింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మాంసం, చేపల విక్రయాలపై నిఘా

నిల్వ ఉన్న మాంసం, చేపలు, ఆహార పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పబ్లిక్ హెల్త్ అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రజలకు పరిశుభ్రమైన ఆహారం అందేలా మార్కెట్లు, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.అలాగే నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరంగా అందించేందుకు మున్సిపాలిటీ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం, సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పర్యటన సందర్భంగా కమిషనర్ పలు ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.