–స్త్రీ శక్తి పథకం అమలులో లోపాలు సరిదిద్దాలి
– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. సావిత్రి
–కడప ఆర్టీసీ డీఎంకు ఐద్వా ఆధ్వర్యంలో వినతిపత్రం
సలాం ప్రొద్దుటూరు – కడప:
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని, మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. సావిత్రి డిమాండ్ చేశారు.కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డీఎంను కలిసి మహిళలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వి. సావిత్రి మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 900 బస్సులు తగ్గించారనే విషయం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్త్రీ శక్తి పథకమే కారణమన్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.
బస్టాప్‌ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆపాలి
అనేక ప్రాంతాల్లో బస్టాప్‌ల సంఖ్య తగ్గించడం, ప్రయాణికులు వేచి ఉన్నప్పటికీ కొన్ని బస్సులు బస్టాప్‌ల వద్ద ఆగకుండా వెళ్లడం జరుగుతోందని సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులతో డ్రైవర్లు, కండక్టర్లు గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారనే కారణంతో బస్సులను ఆపకుండా వెళ్లడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్టాప్‌ల వద్ద బస్సులను తప్పనిసరిగా నిలిపి ప్రయాణికులకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మౌలిక వసతులు కల్పించాలి
బస్టాండ్లలో ఉచిత మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఐద్వా నాయకులు కోరారు. చంటి పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, బస్టాండ్లలో ప్రథమ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.అలాగే బస్టాండ్లలో తినుబండారాలు, వాటర్ బాటిళ్లను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డీఎం సానుకూల స్పందన
ఐద్వా ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై ఆర్టీసీ డీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సమస్యలను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని డీఎం హామీ ఇచ్చినట్లు ఐద్వా నాయకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎన్. సుబ్బమ్మ, జిల్లా కార్యదర్శి ఎస్. ముంతాజ్ బేగం, జిల్లా నాయకులు జమీలా, కామేశ్వరమ్మ, శంషాద్, విజయలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, మేరీ బేబీ, లక్ష్మీదేవి, అమెజాన్ లతీఫ్, ప్రేమ తదితరులు పాల్గొన్నారు.ధర్నాకు సంఘీభావంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రామ్మోహన్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులురెడ్డి, చంద్రారెడ్డి, గోపి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. దస్తగిరిరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి. రవి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు రఘు, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

