SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 5:25 pm Posted by : SALAM PRODDATUR

కమిషనర్ నగర బాట.. సమస్యలపై స్పాట్‌లోనే క్లాస్!

–డ్రైన్ల అక్రమ నిర్మాణాలకు వారం రోజుల డెడ్‌లైన్

–పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా.. అధికారులకు టైమ్‌బౌండ్ ఆదేశాలు

సలాం ప్రొద్దుటూరు :

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తూ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ‘నగర బాట’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మోడంపల్లి ప్రాంతంలో మున్సిపల్, వార్డు సచివాలయ అధికారులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.పర్యటనలో భాగంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక వసతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ప్రజలను నేరుగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డ్రైన్లపై అక్రమ నిర్మాణాలకు డెడ్‌లైన్

మోడంపల్లిలో కొన్ని ప్రాంతాల్లో డ్రైన్లపై అక్రమ నిర్మాణాల కారణంగా మురుగునీరు సక్రమంగా ప్రవహించకుండా రోడ్లపైకి వస్తున్న విషయాన్ని కమిషనర్ గుర్తించారు. దీనిపై టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.డ్రైన్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సంబంధిత స్థానికులకు వారం రోజుల గడువు ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు సూచించారు.

నిర్లక్ష్యం చేస్తే బాధ్యత అధికారులదే

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోందని తెలిపారు. మున్సిపల్ శాఖ ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రజల్లో సానుకూల అవగాహన పెంచేలా అధికారులు పనిచేయాలని సూచించారు.ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవల్లో లోపాలు తలెత్తితే సంబంధిత అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

70 ఏళ్ల మహబున్ని సూచనలకు కమిషనర్ హామీ

పర్యటన సందర్భంగా స్థానికురాలు 70 ఏళ్ల మహబున్ని పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని తెలిపిన కమిషనర్.. ఆమె సూచనలను తప్పనిసరిగా పాటిస్తానని హామీ ఇచ్చారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక నిఘా

ప్రాంతంలో ఎక్కడైనా చెత్త పేరుకుపోయినా, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోయినా చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రతిరోజూ శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని శానిటేషన్ సూపర్‌వైజర్ నూరుబాషాను ఆదేశించారు.మోడంపల్లిలో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతోందని స్థానికులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఏఈ సురేంద్ర, వాటర్ వర్క్స్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు.

ప్రజల వద్దకే పాలన.. కొనసాగనున్న నగర బాట

‘నగర బాట’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారానికి కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి ఉపయోగపడేలా ‘నగర బాట’ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.కార్యక్రమంలో డీఈఈ రాజేష్, యశోద, ఏఈలు సురేంద్ర, దస్తగిరి, శానిటేషన్ సూపర్‌వైజర్ నూరుబాషా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విజయ్ బాబు, వార్డు సచివాలయ సిబ్బంది, నాయకులు సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.