–లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు..
–ఇళ్లు పూర్తి చేసి అప్పగించాలి
–24న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలో జగనన్న ఇళ్ల పథకం కింద స్థలాలు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి వారికి అప్పగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రొద్దుటూరులోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.పట్టణంలో సుమారు 22 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్క సెంటు చొప్పున స్థలాలు కేటాయించి పట్టాలు అందించినప్పటికీ, ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణం పేరుతో పలువురు లబ్ధిదారుల నుంచి రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని వారు ఆరోపించారు. అయితే ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలి
పేదలకు సొంతింటి కలను నెరవేర్చే ఉద్దేశంతో కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సీపీఎం నాయకులు కోరారు. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలకు సంబంధించి తగిన విచారణ చేపట్టి, నిర్మాణాలు పూర్తిచేసి ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
24న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
జగనన్న ఇళ్ల సమస్యపై సెప్టెంబర్ 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.అధికారులు వెంటనే స్పందించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకపోతే సెప్టెంబర్ 24 నుంచి ఆందోళనలను నిరంతరం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. లబ్ధిదారుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం ,పట్టణ కమిటీ సభ్యులు విజయ్‌కుమార్, రమేష్, పాల్గొన్నారు.