SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:06 am Posted by : SALAM PRODDATUR

అభివృద్ధి బాటలో ప్రొద్దుటూరు.. రూ.40 కోట్లతో మౌలిక వసతులకు మహర్దశ

 

–ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సహకారంతో HAM కింద భారీ నిధుల మంజూరు..

–రోడ్లు, డివైడర్లు, ఆధునిక లైటింగ్‌కు ప్రాధాన్యం

సలాం  ప్రొద్దుటూరు:

పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) కింద రూ.40 కోట్ల భారీ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కార్యాలయం వెల్లడించింది. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు చేపట్టనున్నారు.

రోడ్లు.. డివైడర్లు.. ఆధునిక లైటింగ్

రూ.40 కోట్ల నిధులతో పట్టణంలోని రహదారుల అభివృద్ధి, సెంటర్ డివైడర్ల ఏర్పాటు, ఆధునిక లైటింగ్ వ్యవస్థలతో పాటు అవసరమైన ఇతర మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణకు సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఉంటుంది.మౌలిక వసతులు మెరుగుపడటంతో ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు పట్టణానికి మరింత ఆధునిక రూపం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

22న అభివృద్ధి పనులకు శ్రీకారం

ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సెప్టెంబర్ 22, మంగళవారం ఉదయం 10 గంటలకు కుప్పం నియోజకవర్గం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పురపాలక అధికారులు, నాయకులు తదితరులు పాల్గొననున్నారు.

పట్టణ రూపురేఖల్లో మార్పే లక్ష్యం

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు పట్టణ మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిధులను వినియోగం చేస్తారు. రోడ్లు, డివైడర్లు, లైటింగ్ వంటి కీలక సదుపాయాల అభివృద్ధితో పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.