–పారిశుధ్య కార్మికులుగా మారిన కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్, ఏఈ దస్తగిరి
సలాం ప్రొద్దుటూరు:
స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం మూడో రోజు సందర్భంగా వైఎంఆర్ కాలనీలోని పి.డబ్ల్యూ. ఆఫీస్ వద్ద ఉన్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‌ను శుభ్రం చేశారు.గార్బేజ్ పాయింట్ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, ఏఈ దస్తగిరి పారిశుధ్య సిబ్బందితో కలిసి స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని గార్బేజ్ పాయింట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు కూడా పారిశుధ్యంపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, తడి చెత్త–పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్వచ్ఛ ప్రొద్దుటూరు నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
