SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:28 am Posted by : SALAM PRODDATUR

11 లక్షల లావాదేవీపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి

 

–టౌన్ బ్యాంక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

 

సలాం  ప్రొద్దుటూరు:

టౌన్ బ్యాంక్‌లో జరిగిన రూ.11 లక్షల లావాదేవీపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బ్యాంక్ లెడ్జర్లు, ఖాతా వివరాలు, సంబంధిత పత్రాలను పరిశీలించాలని కోరారు.

 

శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాచమల్లు.. టౌన్ బ్యాంక్ వ్యవహారంపై టీడీపీ నాయకుడు ఈవీ సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తనపై గతంలో చేసిన ఆరోపణలనే మళ్లీ ప్రస్తావిస్తూ అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

బ్యాంక్‌కు రాని వ్యక్తికి సంబంధించిన పత్రాలు, ఫొటోలను ఉపయోగించి మరో వ్యక్తి నగదు ఎలా డ్రా చేశారనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని అన్నారు. సుచరితకు సంబంధించిన రూ.11 లక్షలను ఉషారాణి డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. సీసీటీవీ దృశ్యాలు, లెడ్జర్లు, నగదు ఉపసంహరణ పత్రాలు, ఖాతా వివరాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

 

టౌన్ బ్యాంక్ లావాదేవీలపై పారదర్శకంగా విచారణ జరిపి ఖాతాదారుల్లో నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను తాను పలుమార్లు ఖండించానని, తాను ఎవరినీ మోసం చేయలేదని, ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా తనపై ఆరోపణలు చేస్తున్న వారు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేయలేదని రాచమల్లు పేర్కొన్నారు. టౌన్ బ్యాంక్ వ్యవహారంలో వాస్తవాలను తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.