–సచివాలయంలో ఆకస్మిక తనిఖీ.. ప్లాస్టిక్ నివారణ పై సలహా సంఘం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శుక్రవారం స్వర్ణ సుబ్బిరెడ్డి కొట్టాల సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డులను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనిఖీ సమయంలో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ పి. మునిహిమజ సచివాలయంలో అందుబాటులో లేకపోయినప్పటికీ హాజరు పట్టికలో సంతకం చేసినట్లు కమిషనర్ గుర్తించారు. మరికొందరు సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరై హాజరు పట్టికలో సంతకాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, సంబంధిత సిబ్బందిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సచివాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, మున్సిపల్ సేవలు సకాలంలో అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ సూచించారు. సచివాలయాల్లో సిబ్బంది హాజరు, పనితీరుపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
ప్లాస్టిక్ నివారణకు సలహా సంఘం సమావేశం
–స్వచ్ఛ సంకల్ప దీక్షకు ప్రజలు, వ్యాపారుల నుంచి మంచి స్పందన
ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన స్వచ్ఛ సంకల్ప దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఆగస్టు 15 అనంతరం ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెరిగిందన్నారు. పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ తమ దుకాణాల వద్ద అవగాహన బోర్డులు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.మరికొంత మంది వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సాధన ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న శనివారం మధ్యాహ్నం 4 గంటలకు స్వచ్ఛ సంకల్ప దీక్ష సలహా సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై సమావేశంలో సభ్యులతో చర్చించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు, వ్యాపారులు మున్సిపల్ అధికారులకు సహకరించి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.