
సలాం ప్రొద్దుటూరు – గోపవరం:
ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణ, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో గోపవరం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 32 మంది రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. ఇందిర మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితుల్లో పశువులపై వేడి ఒత్తిడి ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ, నీటి పొదుపు, వేడి ఒత్తిడి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.డా. చరిత, డా. గాయత్రి, డా. మంజుల, డా. జాన్, డా. వంశీ, డా. మాధవరెడ్డి తదితరులు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, పశుపోషణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.పశువులకు స్వచ్ఛమైన తాగునీరు, తగినంత నీడ, గాలి ప్రసరణ, సమతుల్య పోషకాహారం అందించాలని నిపుణులు సూచించారు. ఎండుగడ్డి, సైలేజ్ తదితర పశుగ్రాసాలను ముందుగానే సమృద్ధిగా నిల్వ చేసుకోవడం ద్వారా ఎండాకాలంలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చని తెలిపారు.పశువుల్లో అధికంగా శ్వాస తీసుకోవడం, అధిక చెమట, నీరసం, ఆహారం తీసుకోవడంలో తగ్గుదల వంటి వేడి ఒత్తిడి లక్షణాలను గుర్తించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలని రైతులకు సూచించారు. కార్యక్రమం ద్వారా రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో పశువుల సంరక్షణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
