SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 12:44 am Posted by : SALAM PRODDATUR

రోడ్డుపై కార్ల రాకపోకల వివాదం.. వ్యక్తిపై దాడి

–తీవ్రంగా గాయపడి కంటి చూపు కోల్పోయిన యువకుడు..

–ఇద్దరిపై కేసు

 

సలాం ప్రొద్దుటూరు:

రోడ్డుపై కార్లు పక్కకు తీసే విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తిపై దాడికి దారితీసింది. ఈ ఘటనలో గాయపడిన యువకుడు కంటి చూపు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపై ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసుల ప్రకారం.. సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి సుమారు 11.45 గంటల సమయంలో ప్రొద్దుటూరు పట్టణంలోని గౌరమ్మకట్ట వీధిలో గౌరమ్మతల్లి చెట్టు సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా వచ్చాయి. వాహనాలను పక్కకు తీసే విషయంలో ఒక కారులో ఉన్న భార్గవ రెడ్డి, అతని స్నేహితుడు సంతోష్ కుమార్ రెడ్డి మరో కారులోని వ్యక్తులతో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అదే ప్రాంతానికి చెందిన కొమ్మనూరు ధనుష్ కుమార్ @ చిన్న (28) అక్కడ పరిస్థితిని గమనించి వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో భార్గవ రెడ్డి, సంతోష్ కుమార్ రెడ్డి ఇద్దరూ కారులో ఉన్న కర్రలతో ధనుష్ కుమార్‌పై దాడి చేసి, బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో ధనుష్ కుమార్ ఎడమ కంటికి తీవ్ర గాయమైందని, కంటి చూపు కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా పేర్కొన్న భార్గవ రెడ్డి, సంతోష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసు సిబ్బంది చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

గణేష్ ఉత్సవాలతో సంబంధం లేదు

ఈ ఘటనకు గణేష్ ఉత్సవాలతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాల రాకపోకల సమయంలో ఏర్పడిన వ్యక్తిగత వివాదమే ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనపై వదంతులు, నిర్ధారణకాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.