SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 6:40 pm Posted by : SALAM PRODDATUR

అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి రూ.3.50 లక్షల వాటర్ ప్లాంట్ సమర్పణ

 

–భక్తులు, వేదపాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

 

సలాం ప్రొద్దుటూరు:

శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు, వేదపాఠశాల విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు దాతృత్వ కుటుంబం ముందుకు వచ్చింది. ఆలయంలో తాగునీటి అవసరాల కోసం ప్రతి నెల వేలాది రూపాయలు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో డీకే సుబ్రహ్మణ్యం, డీకే శివప్రసాద్, డీకే సతీష్ బాబు, వారి కుటుంబ సభ్యులు సుమారు రూ.3.50 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ప్లాంట్‌ను స్వామివారికి సమర్పించారు.

 

ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం వారి చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

 

ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దాత కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందజేశారు. భక్తులకు, వేదపాఠశాల విద్యార్థులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ వాటర్ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

 

ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. రమణ ఆధ్వర్యంలో జరిగింది. దాత కుటుంబం చేసిన సేవను ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అభినందించారు.