SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 5:48 pm Posted by : SALAM PRODDATUR

బాలల హక్కుల పరిరక్షణకు సీడబ్ల్యూసీ, జేజేబీ నియామకాలు వెంటనే పూర్తి చేయాలి

 

–అరకొర నియామకాలతో బాలల హక్కులకు భంగం

– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు –కడప:

ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC), జువైనల్ జస్టిస్ బోర్డులు (JJB) నియామకాలను అరకొరగా కాకుండా పూర్తిస్థాయిలో తక్షణమే చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.

 

రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ కె.జి. వెంకట పద్మలత కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఆమెను కలిసి శ్రీనివాసులరెడ్డి వినతిపత్రం సమర్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కమిటీల పదవీకాలం ముగిసి రెండేళ్లు దాటుతున్నప్పటికీ కొత్త కమిటీల నియామక ప్రక్రియను ఆలస్యం చేయడం బాధాకరమన్నారు. గత డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు పూర్తిచేసినప్పటికీ, ఆగస్టు 11న విడుదలైన జీవో నెం.17, 18ల ద్వారా కొన్ని జిల్లాలకు మాత్రమే అరకొరగా నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.

 

పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం వల్ల బాల్య వివాహాల బాధితులు, లైంగిక దాడులకు గురైన చిన్నారులు, బాల కార్మికులు, వీధి బాలలు తమ సమస్యలపై సరైన న్యాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో CWC, JJBలను వెంటనే పూర్తిస్థాయిలో భర్తీ చేసి బాలల పరిరక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన కోరారు. నియామకాలలో జరుగుతున్న జాప్యం కారణంగా అభ్యర్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు.

 

ఈ మేరకు సమర్పించిన వినతిపత్రం ప్రతులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లకు పంపినట్లు కామనూరు శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు.