SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 11:11 pm Posted by : SALAM PRODDATUR

ప్రజా పోరాటాల యోధుడు సీతారాం ఏచూరి

 

–ప్రొద్దుటూరులో ఘనంగా రెండో వర్ధంతి కార్యక్రమాలు

 

సలాం   ప్రొద్దుటూరు:

సీపీఎం జాతీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమాలను ప్రొద్దుటూరు పట్టణంలోని విజయకుమార్ సర్కిల్, అమృత్‌నగర్ ప్రాంతాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడుతూ, తన జీవితాంతం కార్మికులు, పేదలు, విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో కార్మికులు, పేదల సమస్యలను బలంగా వినిపించారని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని అన్నారు.సీతారాం ఏచూరి మరణం కార్మికులు, పేదలు, దళితులు, మైనార్టీలు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మన్, అధ్యక్షుడు చంటి, రాఘవేంద్ర, గురమ్మ, రమాదేవి, నీతిమ్మ, శాంతి, అన్నపూర్ణ, మోహన్, మేరీ, బాబు, రాజు, ఐద్వా కార్యదర్శి ప్రేమ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళలు, ప్రజలు పాల్గొని సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పించారు.