SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:01 pm Posted by : SALAM PRODDATUR

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

 

 

–రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, పెన్షన్‌ ఇవ్వాలి.. లేకపోతే సమ్మెకు సిద్ధం: CITU

సలాం   ప్రొద్దుటూరు:

మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, పురపాలక అధికారులు తక్షణమే పరిష్కరించాలని CITU మున్సిపల్ యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికుల సమస్యలపై CITU జిల్లా కమిటీ మార్గదర్శకత్వంలో శుక్రవారం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు పలు డిమాండ్లను వెల్లడించారు.CITU మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు చంటి, కార్యదర్శి సాల్మన్, కోశాధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ.. విధుల్లో ఉండగా మృతి చెందిన మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు నిండిన AP COS కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నప్పటికీ వారికి ఎలాంటి రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, పెన్షన్‌ సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు.రిటైర్ అయ్యే కార్మికులకు రూ.5 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌తో పాటు నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని కోరారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచి, వారికి తగిన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.కోవిడ్‌ సమయంలో సేవలందించిన కార్మికులకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఎస్‌ రేట్ల ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించాలని కోరారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు వెంటనే అందించాలని, మూడు నెలలుగా సరఫరా కాని చీపురు పుల్లలను తక్షణమే తెప్పించాలని అన్నారు.విధుల్లో మృతి చెందిన కార్మికులకు రావాల్సిన రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలను తక్షణమే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.రెగ్యులర్‌ కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలని, ప్రతి రెండేళ్లకు యూనిఫామ్‌, ప్రతి ఏడాది కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు అందించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు డీజిల్‌ కూపన్లపై సంతకాల ప్రక్రియ ఆలస్యం కావడంతో వాహనాలు మార్గమధ్యలోనే నిలిచిపోతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు మరమ్మతులకు గురైన మున్సిపల్‌ వాహనాలను వెంటనే బాగు చేయించాలని కోరారు.కార్మికుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో మున్సిపల్‌ కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున సమ్మె చేపడతామని CITU నాయకులు హెచ్చరించారు.