
–దెబ్బతిన్న భవనాలకు పునరుద్ధరణ..
–ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
సలాం ప్రొద్దుటూరు:
రైతులు, వ్యాపారులకు కీలకమైన ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్కెట్ కమిటీ పరిధిలోని భవనాలు అక్కడక్కడా దెబ్బతిన్నాయని ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు.మార్కెట్ యార్డును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, దెబ్బతిన్న భవనాలు, ఇతర సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డు మౌలిక వసతులను మెరుగుపరిచి, రైతులు మరియు వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.దెబ్బతిన్న భవనాలకు అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై సమగ్రంగా పరిశీలించి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కెట్ యార్డు అభివృద్ధితో రైతులు, వ్యాపారులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్, కార్యదర్శి రత్నంరాజు, డైరెక్టర్ షరీఫ్, మార్కెట్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
