–శాంతి కమిటీ సమావేశం.. నిర్వాహకులకు పలు సూచనలు
–పెద్దశెట్టిపల్లెలో అక్రమ పేకాట గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్
సలాం ప్రొద్దుటూరు:
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు ఉత్సవ కమిటీల ప్రతినిధులు, గ్రామ పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి నిబంధనలపై అవగాహన కల్పిస్తుండగా.. మరోవైపు అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ యు. విబు కృష్ణ, ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో రూరల్ సి.ఐ. ఎం. నాగభూషణ్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సి.ఐ. నాగభూషణ్ సూచించారు. పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన నిబంధనలు, చేయాల్సినవి–చేయకూడనివి తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవిస్తూ సోదరభావం, సామరస్యంతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు.
పెద్దశెట్టిపల్లెలో పేకాట ముఠా గుట్టురట్టు..
ఇదే క్రమంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న మంగతాయి పేకాటపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 9న సాయంత్రం పెద్దశెట్టిపల్లె గ్రామంలోని తళ్ళపురెడ్డి నరసింహారెడ్డి ఇంట్లో అక్రమంగా మంగతాయి పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. ఏఎస్పీ యు. విబు కృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు సి.ఐ. నాగభూషణ్ ఆధ్వర్యంలో ఎస్.ఐ. కె.సి. రాజు సిబ్బందితో కలిసి ఇంటిపై దాడి చేశారు.ఇంటిలోని ప్రత్యేక గదిలో ఏడుగురు వ్యక్తులు నగదును పందెంగా పెట్టి ‘లోపల–బయట’ మంగతాయి పేకాట ఆడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
₹ 15,220 నగదు.. 52 పేకముక్కలు స్వాధీనం
పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.15,220 నగదు, 52 పేకముక్కలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిలో బండి నాగ సుబ్బారెడ్డి, బండి సానారెడ్డి, తళ్ళపురెడ్డి నరసింహారెడ్డి, కొరతాల వెంకట కృష్ణారెడ్డి, మోపూరి సాంబశివారెడ్డి, దూదేకుల పెద్ద సంజీవరాయుడు, మాలేపాటి మహేంద్ర ఉన్నారు. వీరిలో తళ్ళపురెడ్డి నరసింహారెడ్డి జూదాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడిగా పోలీసులు పేర్కొన్నారు.
జూదానికి అడ్డుకట్ట.. సి.ఐ. హెచ్చరిక
సర్కిల్ పరిధిలో పేకాట, మంగతాయి తదితర అక్రమ జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సి.ఐ. నాగభూషణ్ స్పష్టం చేశారు. జూదం ఆడేవారితో పాటు నిర్వహించే వారు, వ్యక్తులను సమీకరించేవారు, జూదానికి ప్రదేశాలు కల్పించేవారు, ఇతర విధాలుగా సహకరించే వారిపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు అక్రమ జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా పేకాట లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ఆయన కోరారు.
శాంతి కమిటీ సమావేశంలో రూరల్ ఎస్.ఐలు శ్రీకాంత్, రాజు, పోలీసు సిబ్బంది, గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.