–ప్రభుత్వ దస్త్రాలను అనుమతి లేకుండా వాట్సాప్‌లో పంపినా కఠిన చర్యలు
–ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే జైలుకే
– కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అక్రమాలకు, అవకతవకలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు పాల్పడినా, పేదల నుంచి డబ్బులు వసూలు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.ప్రభుత్వం పేదలకు సామాజిక భద్రత కల్పించాలనే సదుద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేస్తోందని, దాని ప్రయోజనాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్ తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తిస్థాయి పారదర్శకత పాటించాలని, అర్హులైన వారికి నిబంధనల మేరకు పింఛన్ ప్రయోజనం అందేలా సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రభుత్వ దస్త్రాలు వాట్సాప్‌లో షేర్ చేస్తే వేటే!
అనుమతి లేకుండా ప్రభుత్వ దస్త్రాలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపిన వ్యవహారంపైనా కమిషనర్ తీవ్రంగా స్పందించారు. కమిషనర్ ఛాంబర్‌లో ఉన్న ఉద్యోగుల స్థాపనకు సంబంధించిన దస్త్రాలను పెషీ సిబ్బంది ఇతరులకు పంపిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన, సంబంధిత సిబ్బందికి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారిక దస్త్రాలు, ఉద్యోగుల సేవా వివరాలకు సంబంధించిన రికార్డులను అనుమతి లేకుండా బయటకు పంపడం నిబంధనలకు విరుద్ధమని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ విధులకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్లక్ష్యానికి ఇక చెక్.. విచారణకు అధికారి
దస్త్రాలను అనధికారికంగా పంపిన వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్‌ను విచారణ అధికారిగా నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
“పేదల సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసినా.. ప్రభుత్వ దస్త్రాల గోప్యతను ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదు. సిబ్బంది తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవు” అని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ హెచ్చరించారు.