–అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్ అందేలా చర్యలు
– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ, దరఖాస్తుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న ఇబ్బందులపై దరఖాస్తుదారులతో కమిషనర్ ముఖాముఖిగా మాట్లాడారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, అర్హులైన వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడమే మున్సిపల్ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.వార్డు స్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.