SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 8:07 am Posted by : SALAM PRODDATUR

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై హర్షం

–సీఎం, విద్యాసాగర్‌కు రామసుబ్బయ్య యాదవ్‌ కృతజ్ఞతలు

 

సలాం ప్రొద్దుటూరు:

 

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ జె. రామసుబ్బయ్య యాదవ్‌ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో అభినందన సమావేశం నిర్వహించారు.

సెప్టెంబర్‌ 5న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు డిమాండ్ల పరిష్కారానికి కృషి చేశారని రామసుబ్బయ్య యాదవ్‌ తెలిపారు.

12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం, రెండు డీఏల చెల్లింపు, పెండింగ్‌ డీఏల విడుదల, సరెండర్‌ లీవ్‌ బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగుల డిమాండ్ల సాధనకు కృషి చేసిన ముఖ్యమంత్రి, ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర నాయకత్వం, కడప జిల్లా నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌కుమార్‌, కోశాధికారి సదాశివయ్య, ఉపాధ్యక్షులు నాగార్జున, వరప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీలు సుబ్బారాయుడు, నారాయణరాజు, జేఏసీ నాయకులు శశికిరణ్‌, గోపాల్‌, ఓంకార్‌, మహేశ్వరయ్య, పెన్షనర్లు నాగన్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.