SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 12:11 am Posted by : SALAM PRODDATUR

రాయలసీమ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

 

–వ్యాయామ విద్య అధ్యాపకులకు ఘన సన్మానం

 

సలాం  ప్రొద్దుటూరు:

ఉపాధ్యాయులు తమ బోధనతో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, మంచి నడవడికతో సమాజ మార్పుకు కృషి చేయాలని రాయలసీమ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాధికారి డాక్టర్‌ ఏ. శంకర్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని లింగాపురం సమీపంలోని రాయలసీమ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 

కార్యక్రమం ప్రారంభంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్. రవిశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్. రవిశంకర్‌ మాట్లాడుతూ గురువు దేవుడికంటే గొప్పవాడని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో విశిష్టమైనదని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తితో ఆదర్శ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

 

కార్యక్రమాధికారి డాక్టర్‌ ఏ. శంకర్‌రెడ్డి మాట్లాడుతూ తరగతి గదిలో సమర్థవంతమైన బోధనతో పాటు సమాజంలో మంచి నడవడిక, విలువలతో కూడిన జీవన విధానాన్ని విద్యార్థులకు చూపించడం ద్వారా ఉపాధ్యాయులు సమాజ మార్పులో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

 

అనంతరం కళాశాల వ్యాయామ విద్యార్థులు తమ అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. అధ్యాపకులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి గౌరవం తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటుకున్నారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వ్యాయామ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.