
–విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలి
– కళాశాల ప్రిన్సిపాల్ డా. పాండురంగన్ రవి
సలాం ప్రొద్దుటూరు:
విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న కళాశాలలో టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగన్ రవి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మంచి విలువలతో కూడిన విద్యార్థులే సమాజానికి, దేశానికి భవిష్యత్ సంపదగా నిలుస్తారని పేర్కొన్నారు.
వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని, వారి ప్రతిభను గుర్తించి సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీర కుమార్ రెడ్డి, కరస్పాండెంట్ వీర కళ్యాణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశ్వర రెడ్డి అధ్యాపకులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
టీచర్స్ డే వేడుకల్లో భాగంగా కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. సిబ్బంది ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేసి అభినందించింది.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
