–ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీరుపై వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోటూరు వెంకటేష్ ఆగ్రహం
సలాం ప్రొద్దుటూరు:
రజక సామాజిక వర్గానికి స్టోర్ ఏర్పాటు చేయాలని గతంలో కోరిన సమయంలో తమను అవమానించేలా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోటూరు వెంకటేష్ ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయ విమర్శల పేరుతో బీసీ వర్గాలను రాజకీయాలకు అడ్డం పెట్టుకోవడం సరికాదని ఆయన అన్నారు.
గోటూరు వెంకటేష్ మాట్లాడుతూ.. తాను గత 18 ఏళ్లుగా రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. గతంలో రజకులకు స్టోర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ప్రజాప్రతినిధులను కలిసిన సందర్భాలను గుర్తుచేశారు. ఆ సమయంలో “రజకులకు మీకు ఎందుకు స్టోర్? మీరు ఉతుకులు చేసుకోవాలంటే నేను తట్టలు అందిస్తా.. ఒక వ్యక్తి మాత్రమే బతుకుతాడు, మీకెందుకు స్టోర్?” అంటూ తమను అవమానించే విధంగా మాట్లాడారని ఆరోపించారు.
అయితే ప్రస్తుతం తమ నాయకత్వంలో బీసీ వర్గాలకు రాజకీయంగా అవకాశాలు, గౌరవం లభించాయని వెంకటేష్ పేర్కొన్నారు. 2 స్టోర్లు ,ఎంపీటీసీ, కౌన్సిలర్ తదితర పదవులతో పాటు వివిధ నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
“మా నాయకుడు నన్ను సొంత అన్నలా భావించి తన పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించారు. కులం పేరుతో ఎప్పుడూ తక్కువగా చూడలేదు. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడమే కాకుండా వారికి గౌరవం కూడా ఇచ్చారు” అని వెంకటేష్ అన్నారు.
గతంలో తమతో మాట్లాడిన పలువురు నాయకులు కూడా తమ నాయకుడు రజక సామాజిక వర్గాన్ని గౌరవిస్తారని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజకీయంగా ఎవరి విధానాలనైనా విమర్శించవచ్చని, అయితే ఒక పార్టీ లేదా వ్యక్తిపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను మొత్తం బీసీ సమాజానికి ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు.
బీసీ సంఘాలతో తనకు దీర్ఘకాలంగా అనుబంధం ఉందని వెంకటేష్ తెలిపారు. బీసీల సమస్యలు, సామాజిక సంఘాల కార్యక్రమాల్లో తాను నిరంతరం పాల్గొంటున్నానని చెప్పారు. బీసీల ఐక్యత, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
“పార్టీ పరంగా విమర్శలు చేసుకోండి.. వ్యక్తులను రాజకీయంగా వ్యతిరేకించండి. కానీ బీసీ అనే సామాజిక వర్గాన్ని రాజకీయాలకు అడ్డం పెట్టుకుని విమర్శించడం మాత్రం సరికాదు” అని గోటూరు వెంకటేష్ అన్నారు.