SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:29 pm Posted by : SALAM PRODDATUR

మహిళా జర్నలిస్టులపై లాఠీచార్జీని ఖండించిన ఎంపీజే

 

 

–పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి

 

సలాం   ప్రొద్దుటూరు:

ఢిల్లీలో ముస్లిం మహిళా జర్నలిస్టులపై పోలీసుల లాఠీచార్జీని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రొద్దుటూరు శాఖ తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడటం పత్రికా స్వేచ్ఛ, మహిళల గౌరవం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎంపీజే నాయకులు పేర్కొన్నారు.

 

చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగానికి, చట్టానికి విధేయులుగా పనిచేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, నిరసనలను బలప్రయోగంతో చెదరగొట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమని అన్నారు.

 

ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులుగా తేలిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీజే డిమాండ్ చేసింది. గాయపడిన మహిళా జర్నలిస్టులకు తగిన వైద్య సహాయం, న్యాయం అందించాలని కోరింది.

 

దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా భద్రత కల్పించాలని ఎంపీజే నాయకులు కోరారు. పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

 

“పోలీసు వ్యవస్థ రాజకీయాలకు కాదు.. రాజ్యాంగానికి విధేయంగా ఉండాలి. జర్నలిస్టులపై దాడులు ఆపాలి. మహిళల గౌరవాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి” అని ఎంపీజే నాయకులు పిలుపునిచ్చారు.

 

మహిళల గౌరవం, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు గొంతెత్తాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాష, ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్, కార్యదర్శి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.