SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 11:37 am Posted by : SALAM PRODDATUR

బీసీల సమస్యలపై పోరాడకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు

 

 

–టీడీపీ బీసీ నాయకుల గత వైఖరిపై ప్రశ్నలు సంధించిన మాజీ మునిసిపల్ వైస్‌చైర్మన్ చింతకుంట షేక్ ఖాజా

 

సలాం   ప్రొద్దుటూరు:

బీసీ వర్గాల సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని మాజీ మునిసిపల్ వైస్‌చైర్మన్ చింతకుంట షేక్ ఖాజా అన్నారు. ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో టీడీపీకి చెందిన బీసీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బీసీ ప్రజలు అమాయకులు కాదని, ఎవరు నిజం మాట్లాడుతున్నారు.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో వారికి తెలుసన్నారు.

 

టీడీపీ నాయకులు తమను తాము బీసీలకు మేలు చేసే నాయకులుగా చెప్పుకోవడం కంటే, గతంలో బీసీ వర్గాలకు చెందిన నాయకులు, ప్రజలకు ఎదురైన సమస్యల సమయంలో వారి వైఖరి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

 

చెన్నా వెంకట సుబ్బన్న ఇంటి వద్ద బాంబుల ఘటన జరిగినప్పుడు బీసీ సంఘాలు, టీడీపీకి చెందిన బీసీ నాయకులు ఎందుకు స్పందించలేదని ఖాజా ప్రశ్నించారు. అలాగే పాణ్యం సావిత్రమ్మను పదవి నుంచి తొలగించిన సమయంలో కూడా బీసీ నాయకులుగా చెప్పుకునే వారు ఏం చేశారని నిలదీశారు.

 

బీసీ నాయకుడిని చైర్మన్ చేయాలనే ప్రయత్నం జరిగినప్పుడు కూడా కొందరు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. అప్పట్లో జరిగిన పరిణామాలను బీసీ ప్రజలు మరిచిపోలేదని అన్నారు.

 

వ్యక్తిగత విమర్శలను బీసీ సమస్యగా మార్చొద్దు

 

చల్లా రాజగోపాల్ యాదవ్‌ను ఉద్దేశించి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ సమస్యగా చిత్రీకరించడం సరికాదని ఖాజా పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను కుల వివాదంగా మార్చి బీసీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.

 

గతంలో రాజకీయ నాయకుల మధ్య జరిగిన వివాదాలు, పరస్పర విమర్శలను కూడా ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. రాజకీయాల్లో మాటలు అనేవి సందర్భానుసారంగా వస్తుంటాయని, వాటిని కులాల మధ్య చిచ్చుగా మార్చడం వల్ల బీసీ సమాజానికే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

 

బీసీ పేదల సమస్యలపై పోరాడండి

 

బీసీ వర్గాల్లో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వైద్యం చేయించుకోలేని పేదల కోసం పోరాడాలని ఖాజా సూచించారు. బీసీలకు సంబంధించిన వాస్తవ సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

 

“బీసీల సమస్యలు, పేదల వైద్య సమస్యలు, విద్య, ఉపాధి వంటి అంశాలపై మాట్లాడండి. వ్యక్తిగత రాజకీయ వివాదాలను బీసీ సమస్యలుగా చిత్రీకరించకుండా, బీసీల అభివృద్ధి కోసం నిజమైన పోరాటం చేయాలి” అని మాజీ మునిసిపల్ వైస్‌చైర్మన్ చింతకుంట షేక్ ఖాజా అన్నారు.