SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:36 am Posted by : SALAM PRODDATUR

బీసీలకు పదవులిచ్చి.. రాజకీయంగా ప్రోత్సహించాం

–బీసీలకు గౌరవం, అవకాశాలు కల్పించింది వైఎస్సార్‌సీపీయే: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

రాజకీయ విమర్శలను స్వీకరిస్తా.. కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తే సహించను

 

సలాం  ప్రొద్దుటూరు:

తన రాజకీయ ప్రస్థానం 1996లో ప్రారంభమై, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవ స్ఫూర్తితో ఈ స్థాయికి చేరుకున్నానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షతో తన మేనమామ సహకారంతో రాజకీయాల్లోకి వచ్చానని, తాను డిగ్రీ గ్రాడ్యుయేట్‌నని తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికాలు లేవని పేర్కొన్నారు.

శుక్రవారం దొరసానిపల్లెలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచమల్లు మాట్లాడారు. తన తండ్రి మైసూర్‌ మహారాజు అని తాను ఏనాడూ చెప్పుకోలేదని, అలాగే తన కుటుంబంలో ఎవరైనా ఎంపీలు, మంత్రులు ఉన్నారని రాజకీయంగా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.

బీసీలకు అనేక పదవులు, అవకాశాలు కల్పించాం

తన రాజకీయ జీవితంలో బీసీ వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా అనేక అవకాశాలు కల్పించామని రాచమల్లు తెలిపారు. భీమునిపల్లె లక్ష్మిదేవిని ఐదేళ్లపాటు మున్సిపల్‌ చైర్మన్‌గా, శేఖర్‌ యాదవ్‌ను ఎంపీపీగా, ఆయన భార్యను సర్పంచ్‌గా అవకాశం కల్పించామని చెప్పారు.

అలాగే జింకా విజయలక్ష్మికి పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, రమేష్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి, యాలం తులశమ్మకు మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి దక్కేలా సహకరించామని వివరించారు. పలువురు బీసీలకు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, డైరెక్టర్లుగా అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించామని ఆయన అన్నారు. బీసీలకు గౌరవం, పదవులు కల్పించిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని పేర్కొన్నారు.

రౌండ్‌టేబుల్‌ సమావేశంపై విమర్శలు

ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేవలం టీడీపీకి చెందిన బీసీ సంఘాల నాయకులే పాల్గొన్నారని రాచమల్లు అన్నారు. టీడీపీకి చెందిన బీసీ నాయకులకు ఏదైనా సమస్య వస్తే స్పందించే వారు, నిజమైన బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం వారి పక్షాన నిలబడటం లేదని విమర్శించారు.

టీడీపీకి చెందిన కొంతమంది బీసీ నాయకులు ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారికి అన్యాయం జరిగితేనే స్పందించే పరిస్థితి ఉందని ఆరోపించారు. బీసీలకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు వారి తరఫున నిలబడాలని సూచించారు.

బీసీల మద్దతుతోనే రెండుసార్లు గెలిచా

ప్రొద్దుటూరు పట్టణంలోని 40 వార్డుల్లో బీసీలు తనకు ఓట్లు వేయకుంటే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలవగలిగానని రాచమల్లు ప్రశ్నించారు. తనకు వచ్చిన మెజారిటీ ప్రజల మద్దతుకు నిదర్శనమని అన్నారు.

2009లో అప్పటి ఎమ్మెల్యే లింగారెడ్డి గెలుపునకు తాను మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. ఆ సమయంలో దొరసానిపల్లెలో 1,200 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ తమకు మెజారిటీ వచ్చిందని, 2024 ఎన్నికల్లో మాత్రం దొరసానిపల్లెలో సుమారు 800 ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు.

ఓటమి తనకు గురువులాంటిదని వ్యాఖ్య

తన ఓటమిని ఎప్పుడూ స్వాగతిస్తానని రాచమల్లు అన్నారు. ఓటమి తనకు గురువులాంటిదని, ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. 2024 ఎన్నికల్లో తన ఓటమికి రెండు కారణాలు ఉన్నాయని, అందులో ఈవీఎంల అంశంతో పాటు ప్రజల అవసరాలను మరింతగా గుర్తించి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రజాసేవలో ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని, తిరిగి గెలిచి ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలే వైఎస్సార్‌సీపీకి బలం

తమ బలం ప్రజాసేవ, ప్రజలేనని రాచమల్లు అన్నారు. “ప్రజాబలమే వైఎస్సార్‌సీపీకి బలం. వైఎస్‌ జగన్‌ మా గుండెకాయ” అని పేర్కొన్నారు. బీసీలు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటారని అన్నారు.

బీసీలకు మేలు చేసి, వారికి రాజకీయ పదవులు, గౌరవం కల్పించిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని తెలిపారు. బీసీల పేరుతో రాజకీయ లబ్ధి పొందడం కాకుండా వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ గెలవాలని ప్రయత్నిస్తోందని రాచమల్లు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజాబలం లేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ఎవరి బలం ఎంత అనేది తేలిపోతుందని అన్నారు.

బీసీ కార్డుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం

బీసీ కార్డును ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని రాచమల్లు ఆరోపించారు. బీసీల మనసు గెలుచుకోవాలంటే కేవలం వారి పేరును రాజకీయాలకు ఉపయోగించుకోవడం కాకుండా, వారికి గౌరవం ఇవ్వాలని, ఆపద సమయంలో అండగా నిలవాలని హితవు పలికారు.

కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తే సహించను

రాజకీయంగా తనపై చేసే విమర్శలను తాను స్వీకరిస్తానని రాచమల్లు స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత విమర్శలు చేయడం, కుటుంబం జోలికి వెళ్లి కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం మాత్రం సహించబోనని అన్నారు. తన స్థానంలో ఎవరున్నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇదే విధంగా స్పందిస్తారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భీమునిపల్లె లక్ష్మిదేవి, మాజీ ఎంపీపీ శేఖర్‌ యాదవ్, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సి.ఎస్. ఖాజామోహిద్దీన్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ యాలం తులశమ్మ, పట్టణ వైసీపీ మహిళా అధ్యక్షురాలు చింతల దానమ్మ, మాజీ కౌన్సిలర్లు పిట్టా భద్రమ్మ, అరుణ, గంజికుంట రామసుబ్బమ్మ, వైసీపీ నాయకులు భీమునిపల్లె నాగరాజు, బండారు సూర్యనారాయణ, గోటూరు వెంకటేశ్, నల్లదేశి జంగమయ్య, మురళి, రాగా నరసింహారావు, సంజీవకర్ణ, పన్నీటి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.