–వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళల పెన్షన్లు రెండున్నరేళ్లుగా నిలిపివేత
–ఆందోళనకు సిద్ధమవుతున్న ఐద్వా
సలాం ప్రొద్దుటూరు:
వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన పెన్షన్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది.
ప్రొద్దుటూరులోని ఐద్వా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐద్వా కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు వై. విజయమ్మ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 30 నెలలు కావస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అనేక మంది ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భర్తలను కోల్పోయిన అనేక మంది వితంతువులు కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలు కూడా పెన్షన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.
పెన్షన్లను వెంటనే పునరుద్ధరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని వారు కోరారు. సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఐద్వా నాయకులు హెచ్చరించారు.