SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 9:17 am Posted by : SALAM PRODDATUR

రాజగోపాల్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు –బేపారి జాకీర్

 

–బీసీల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

 

సలాం    ప్రొద్దుటూరు:

టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

ఈ సందర్భంగా జాకీర్ మాట్లాడుతూ.. రాజగోపాల్ యాదవ్‌పై అహంకారపూరితంగా, అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలను సమావేశానికి హాజరైన బీసీ నాయకులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు.

 

బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వారని, బీసీ వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని జాకీర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చని, అయితే వ్యక్తిగత దూషణలకు, అనుచిత వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు.

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటువంటి వ్యాఖ్యలపై ప్రజలు తగిన విధంగా స్పందించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని కోరారు.

 

చల్లా రాజగోపాల్ యాదవ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు, ప్రఖ్యాతి సంపాదించుకున్నారని జాకీర్ అన్నారు. అటువంటి వ్యక్తిపై దుర్భాషలు ఉపయోగించడం తగదని స్పష్టం చేశారు.

 

బీసీ వర్గాల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, రాజకీయ విభేదాలను వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లకుండా ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.

 

ఈ సందర్భంగా బీసీ నేతల సమావేశానికి హాజరైన నాయకులు, పెద్దలందరికీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ ధన్యవాదాలు తెలిపారు.