SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 9:35 am Posted by : SALAM PRODDATUR

బీసీ లు ఐక్యంగా ఉండాలి–నల్లబోతుల నాగరాజు

 

 

–బీసీలపై దాడులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందిస్తాం

 

సలాం  ప్రొద్దుటూరు:

బీసీలందరూ ఐక్యంగా ఉండాలని, బీసీలపై జరుగుతున్న దాడులు, వివక్షను ఎదుర్కొనే ఉద్దేశంతోనే గురువారం బీసీ నేతల సమావేశం నిర్వహించామని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల    నాగరాజు అన్నారు. సమావేశంలో బీసీ నాయకులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

 

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీసీ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు ఒక్క రాజగోపాల్ యాదవ్‌ను మాత్రమే ఉద్దేశించినవి కావని, యావత్ బీసీ సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

 

ప్రొద్దుటూరులో బీసీల జనాభా గణనీయంగా ఉందని, ఎన్నికల్లో బీసీల ఓట్లే కీలకమని నాగరాజు అన్నారు. గతంలో బీసీలకు సంబంధించిన పలు పరిణామాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. నందం సుబ్బయ్య హత్య ఘటనను కూడా గుర్తుచేస్తూ, ఆ ఘటన బీసీ సమాజంలో తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

 

బీసీ నాయకుడు చల్లా రాజగోపాల్ యాదవ్‌పై “నాలుక కోస్తాం” అంటూ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాగరాజు డిమాండ్ చేశారు. బీసీ నాయకులపై బెదిరింపులకు పాల్పడే విధానాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

 

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రాజగోపాల్ యాదవ్‌కు, ప్రొద్దుటూరు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. లేనిపక్షంలో బీసీ నేతలంతా సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.

 

బీసీల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా ఫలించవని నాగరాజు అన్నారు. బీసీలపై మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించాలని సూచించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

 

రాబోయే ఎన్నికల్లో బీసీల రాజకీయ చైతన్యం ఏమిటో చూపిస్తామని, బీసీలను తక్కువగా అంచనా వేయడం సరికాదని నల్లబోతుల నాగరాజు హెచ్చరించారు. బీసీల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.