SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 11:52 pm Posted by : SALAM PRODDATUR

10 సెంట్ల భూమి కోసం 100 ల ఎకరాల రైతుల సాగునీటిని అడ్డుకుంటారా?

 

 

–కాలువ పూడ్చితే రైతులతో కలిసి బైఠాయిస్తా

 

–సాగునీటిపై రాజకీయాలు చేస్తే చరిత్ర క్షమించదు

 

–రైతుల ప్రయోజనాలే ముఖ్యం.. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు:

ఒక్కరి 10 సెంట్ల పట్టా భూమికి సంబంధించిన అభ్యంతరం కారణంగా 100 ల ఎకరాల రైతుల సాగునీటిని నిలిపివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. తాళ్లమాపురం గ్రామంలో సాగునీటి కాలువను పూడ్చివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం రైతులతో కలిసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ శ్రీకాంత్‌తో మాట్లాడారు.బ్రిటిష్‌ కాలం నుంచే కేసీ కెనాల్ ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందుతోందని రాచమల్లు తెలిపారు. మెయిన్ కెనాల్ నుంచి సబ్‌ కెనాళ్లు, పంట కాలువల ద్వారా దశాబ్దాలుగా రైతులు తమ పొలాలకు నీటిని తీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం సుమారు 10 సెంట్ల భూమికి సంబంధించిన అభ్యంతరం కారణంగా దాదాపు 300 ఎకరాల సాగునీటికి ముప్పు ఏర్పడిందని పేర్కొన్నారు.కాలువను మూసివేస్తే దిగువ ప్రాంతాల్లోని రైతుల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను రాజకీయ కోణంలో కాకుండా రైతుల ప్రయోజనాల దృష్టితో పరిష్కరించాలని కోరారు.

“ఒక్క రైతు భూమికి అభ్యంతరం ఉంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవచ్చు. నష్టపరిహారం ఇవ్వడం, అవసరమైతే భూమిని కొనుగోలు చేయడం వంటి మార్గాలను పరిశీలించవచ్చు. కానీ వందలాది రైతుల సాగునీటిని నిలిపివేయడం మాత్రం అంగీకరించేది లేదు” అని రాచమల్లు స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో కొందరు టీడీపీ నాయకులు కాలువ మూసివేతకు మద్దతు ఇస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కూడా వారికి అండగా నిలుస్తున్నారని రాచమల్లు ఆరోపించారు.

“పంట కాలువలపై రాజకీయాలు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. రైతుల పంటలు, గ్రామాల ప్రశాంతత కంటే రాజకీయాలు పెద్దవి కావు. సమస్య పరిష్కారం కాకుండా రైతులకు నష్టం జరిగితే కాలువ వద్దే రైతులతో కలిసి బైఠాయిస్తా” అని ఆయన హెచ్చరించారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు వీరారెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, దేవీప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.