SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 6:00 pm Posted by : SALAM PRODDATUR

కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టాం.. ఇప్పుడు హక్కుల కోసం పెన్‌డౌన్!

–జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వైద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది నిరసన

–“అర్హులైన వారిని క్రమబద్ధీకరించాలి.. 100 శాతం గ్రాస్‌ పే, ఈపీఎఫ్‌, ఉద్యోగ భద్రత కల్పించాలి”

 

సలాం   ప్రొద్దుటూరు:

కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన కాంట్రాక్టు వైద్య, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెన్‌డౌన్‌ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌ కడప మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (JAC) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా సుబ్బమ్మ, మానస, హైమవతమ్మ, శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ప్రభుత్వ వైద్య రంగంలో కాంట్రాక్టు విధానంలో సేవలందిస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు తగిన వేతనాలు, సేవా ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు

అర్హత కలిగిన కాంట్రాక్టు వైద్య, ఆరోగ్య సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, రెగ్యులరైజేషన్‌ జరిగే వరకు 100 శాతం గ్రాస్‌ పే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు.

అన్ని కాంట్రాక్టు ఉద్యోగులకు ఈపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగులకు మ్యుచువల్‌ ట్రాన్స్‌ఫర్లు, రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు సిబ్బందికి తగిన సేవా ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

కరోనా సేవలను గుర్తించాలి

కరోనా మహమ్మారి సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలందించామని కాంట్రాక్టు నర్సులు, వైద్య, పారామెడికల్‌ సిబ్బంది గుర్తుచేశారు. ఆ సమయంలో పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు.

“కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేశాం. నేడు కూడా రోగుల సేవలోనే ఉన్నాం. మా ఉద్యోగాలకు భద్రత కల్పించి, మా కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి” అని కాంట్రాక్టు నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం

పెన్‌డౌన్‌ కార్యక్రమం చేపట్టినప్పటికీ రోగులకు వైద్య సేవలకు అంతరాయం కలగకుండా తమ బాధ్యతలను కొనసాగిస్తున్నామని సిబ్బంది తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలు దశల్లో నిరసనలు చేపట్టామని, ప్రభుత్వం స్పందించకపోవడంతో తుది దశ ఆందోళనకు సిద్ధమవుతున్నామని జేఏసీ నాయకులు తెలిపారు.

“హక్కుల కోసం పోరాటం తప్పదు.. మా సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం” అని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.