SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 12:42 am Posted by : SALAM PRODDATUR

మైనర్ డ్రైవింగ్‌పై వన్‌టౌన్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

–15 మంది మైనర్ల గుర్తింపు.. –తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌  ₹13,245 జరిమానా

సలాం  ప్రొద్దుటూరు:

మైనర్ డ్రైవింగ్‌, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అధిక సీసీ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల వినియోగంపై ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని గాంధీ రోడ్డులో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వయస్సు నిండకముందే ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, అధిక సీసీ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను నడుపుతున్న వారిని తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో సుమారు 15 మంది మైనర్ డ్రైవర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.   తల్లిదండ్రులను సమాచారం ఇచ్చి మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, రోడ్డు భద్రతా నిబంధనలపై తల్లిదండ్రులకు, మైనర్లకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడిన వాహనాలకు సంబంధించి మొత్తం రూ.13,245 జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు.మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, నిబంధనలకు విరుద్ధంగా అధిక సామర్థ్యం కలిగిన వాహనాలను వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వన్‌టౌన్ పోలీసులు స్పష్టం చేశారు.