SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 1:17 pm Posted by : SALAM PRODDATUR

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్‌..

 

–ఆయన జీవితం రాజకీయ నాయకులకు ఓ పాఠం.. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత

–వైఎస్సార్‌ ఆశయాలే స్ఫూర్తిగా ప్రజల కోసం ముందుకు సాగుతాం– రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

“వైఎస్సార్‌ మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉన్నారు. పేదవాడి కళ్లలో కనిపించే ఆశలో, రైతు పొలంలో పచ్చగా కనిపించే పంటలో, విద్యార్థి చేతిలోని ఉన్నత విద్యలో, నిరుపేదకు అందిన వైద్యంలో వైఎస్సార్‌ ఆలోచన కనిపిస్తుంది” అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని అన్వర్‌ థియేటర్‌ సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్‌, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌తో తనకు ఉన్న పరిచయం, ఆయనతో సాగించిన ప్రయాణం జీవితాంతం మరిచిపోలేనిదని తెలిపారు. సమస్యతో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యను పరిష్కరించే వరకు శ్రద్ధ చూపిన నాయకుడు వైఎస్సార్‌ అని గుర్తుచేశారు.

“రాజకీయ నాయకుడు ప్రజల మధ్య ఎలా ఉండాలి? పేదవాడి కన్నీటిని ఎలా తుడవాలి? అధికారం అంటే ప్రజలకు సేవ చేయడమేనని ఎలా నిరూపించాలి? అన్నది వైఎస్సార్‌ తన జీవితంతో చేసి చూపించారు. ఆయన జీవితం ఒక సందేశం.. ఆయన పాలన ఒక స్ఫూర్తి.. ఆయన మానవతా విలువలు ఒక మార్గదర్శకం” అని రాచమల్లు అన్నారు.

 

ఆరోగ్యశ్రీ.. పేదల ప్రాణాలకు భరోసా

 

వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని రాచమల్లు పేర్కొన్నారు. డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ అండగా నిలిచిందని, లక్షలాది కుటుంబాలకు ఈ పథకం ప్రాణదాతగా మారిందన్నారు.

 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట

 

పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న గొప్ప ఆలోచనతో వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి తమ కుటుంబాల స్థితిగతులను మార్చుకున్నారని అన్నారు.

 

జలయజ్ఞం.. రైతు పొలాల్లో పచ్చదనం

 

రైతుకు సాగునీరు.. ప్రతి కుటుంబానికి తాగునీరు అందించాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జలయజ్ఞాన్ని చేపట్టారని రాచమల్లు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని పచ్చని పంట పొలాలతో కళకళలాడేలా చేయాలన్న ఆయన సంకల్పం చిరస్మరణీయమన్నారు. అందుకే వైఎస్సార్‌ను ప్రజలు అపర భగీరథుడిగా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు.

 

పేదవాడి సొంతింటి కలను సాకారం చేసిన నాయకుడు

 

నిరుపేద కుటుంబానికి సైతం సొంత గూడు ఉండాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పెద్ద ఎత్తున గృహ నిర్మాణానికి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారని రాచమల్లు గుర్తుచేశారు. పేదవాడి జీవితంలో భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం తీసుకురావడమే ఆయన సంక్షేమ పాలన లక్ష్యమన్నారు.

 

“వైఎస్సార్‌ మాకు స్ఫూర్తి.. జగన్‌ మా భవిష్యత్‌”

 

“వైఎస్సార్‌ ఆశయాలు, ఆయన చూపిన బాటే మాకు స్ఫూర్తి. ఆ మహానేత అడుగుజాడల్లోనే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. వైఎస్సార్‌ సంక్షేమ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల అండగా నిలుస్తారు” అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, “తండ్రి చూపిన బాటలో నడుస్తున్న తనయుడిగా జగన్‌ ప్రజల కోసం పోరాడుతున్నారు” అని కొనియాడారు.2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రజల ఆశీస్సులతో ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తాయని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక ఆలోచన.

వైఎస్సార్‌ ఒక జ్ఞాపకం కాదు.. ఒక స్ఫూర్తి.

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ మహానేత ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.