SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 12:34 am Posted by : SALAM PRODDATUR

క్రీడా స్ఫూర్తికి వేదికగా.. టీడీపీ–టీఎన్‌ఎస్‌ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్

 

–సెమీఫైనల్లో యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాల జయభేరి.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రేవంత్‌

 

సలాం   ప్రొద్దుటూరు:

విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ.. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉత్సాహభరితంగా కొనసాగుతోంది.టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన క్రీడాకారులు మ్యాచ్‌ ఆద్యంతం పోరాట పటిమను ప్రదర్శించారు.మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రేవంత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీ లభించింది. ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ రేవంత్‌కు ట్రోఫీ అందజేసి అభినందించారు.అదేవిధంగా టోర్నమెంట్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ సాధించిన క్రీడాకారుడికి ప్రత్యేక ట్రోఫీ అందజేసి డా. వి.ఎస్. ముక్తియార్ అభినందనలు తెలిపారు. యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి మరింత ఉత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులకు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తిని అందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు.ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో, సమష్టి కృషితో ఆడి విజయం సాధించి తమ ప్రతిభను చాటుకోవాలని యోగివేమన ఇంజినీరింగ్‌ కళాశాల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.యువతలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం.. విజయమే లక్ష్యంగా ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైన యోగివేమన జట్టు!