–ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం..
–పరిసర పంచాయతీలు, మున్సిపాలిటీలతో సమన్వయ సమావేశం
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలో వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.ఇటీవల నిర్వహిస్తున్న “ప్రజలతో కమిషనర్ ముఖాముఖి” కార్యక్రమంలో పట్టణ ప్రజల నుంచి వీధి కుక్కల సమస్యపై అనేక ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో, సమస్య తీవ్రతను అంచనా వేసి పరిష్కార మార్గాలను రూపొందించేందుకు ప్రాథమిక నివేదిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.వీధి కుక్కల సమస్య కేవలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధికే పరిమితమైనది కాదని, పట్టణ పరిసర ప్రాంతాలు, గ్రామాలు, ఇతర మున్సిపాలిటీలకు కూడా సంబంధించిన అంశమని కమిషనర్ పేర్కొన్నారు. అందువల్ల అన్ని ప్రాంతాల అధికారులతో సమన్వయం చేసుకుని సమగ్ర పరిష్కారం సాధించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిసరాల్లోని కొత్తపల్లె, దొరిసానిపల్లె, గోపవరం, సోములవారిపల్లె, చౌటపల్లె పంచాయతీల ప్రతినిధులతో పాటు మైదుకూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, కమలాపురం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ సమగ్ర సమావేశం జరగనుందని కమిషనర్ తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 7 వేల వీధి కుక్కలు ఉన్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో, సంబంధిత అధికారులందరితో చర్చించి సమన్వయంతో కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు.ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్టబద్ధమైన, మానవతా దృక్పథంతో కూడిన శాస్త్రీయ పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ స్పష్టం చేశారు.